- మెదక్ జిల్లా అల్లాదుర్గంలో ఘటన
- పోలీస్ స్టేషన్ ముందు బాధిత కుటుంబసభ్యుల ఆందోళన
అల్లాదుర్గం, వెలుగు: కానిస్టేబుల్ కొట్టాడని మనస్తాపం చెందిన ఓ వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం రాంపూర్ గ్రామానికి చెందిన తలారి కిషన్(32) తన సెల్ ఫోన్ పోయిందని బుధవారం రాత్రి అల్లాదుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి వెళ్లాడు. ఆ సమయంలో సాయిలు అనే కానిస్టేబుల్ కొట్టడంతో, పోలీస్‌స్టేషన్‌కు వెళితే న్యాయం జరగకపోగా.. బాధితుడినైన తననే కొట్టడంతో తాను మనస్తాపానికి గురయ్యానని కిషన్ సూసైడ్ నోట్ రాసి గ్రామంలోని కమ్యూనిటీ హాల్లో ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుని సూసైడ్ చేసుకున్నాడు.
కమ్యూనిటీ హాలులో నుంచి పొగలు రావడంతో గమనించిన గ్రామస్తులు అక్కడికి వెళ్లి చూడగా, కిషన్ కాలిన గాయాలతో ఉండడాన్ని గమనించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వారు తీవ్రంగా గాయపడిన కిషన్ ను చికిత్స కోసం సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్ పరిశీలిస్తుండగానే చనిపోయాడు. ఇదిలాఉంటే కిషన్ సూసైడ్ చేసుకున్న కమ్యూనిటీ హాల్ సమీపంలో అతని బైక్ నిలిపి ఉండగా, బుధవారం కుటుంబసభ్యులు పరిశీలించగా.. అందులో రూ.10 వేలు, ఒక లెటర్ దొరికింది. అందులో ‘రాత్రి పోలీస్ స్టేషన్‌కు వెళితే కానిస్టేబుల్ సాయిలు కొట్టాడు. నన్ను చంపేసింది నా చుట్టూ ఉన్న ప్రకృతి, పీఎస్ కు పోతే న్యాయం జరగలేదు. సత్యం చచ్చిపోయింది, ఎస్ఐ ప్రవీణ్‌రెడ్డి సార్ సెల్యూట్’ అని రాసి కింద కిషన్ అని సంతకం ఉంది.
కానిస్టేబుల్ కొట్టడంతోనే కిషన్ సూసైడ్ చేసుకున్నాడని తెలుసుకున్న బంధువులు కానిస్టేబుల్ సాయిలును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ అల్లాదుర్గం పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేశారు. తమకు న్యాయం జరిగేంత వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. అల్లాదుర్గం సీఐ రేణుకా రెడ్డి విచారణ జరిపి కానిస్టేబుల్ పై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.